
అదే స్పీడ్..!
వర్షాకాలంలోనూ
భానుడు భగభగల కారణంగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, విశాఖపట్నం: వరుణుడు కరుణించాల్సిన సమయంలో సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిన జనం.. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాకాలం మొదలై నెలరోజులు గడిచినా ఉష్ణోగ్రతలు తారస్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నా.. ఉక్కబోత మాత్రం 45 నుంచి 48 డిగ్రీల ప్రభావం చూపిస్తోంది. వేడి తట్టుకోలేక జనం ఉదయం నుంచి రాత్రి వరకూ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకే అతుక్కుపోతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రుగిర్రుని తిరుగుతున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో జూలై నెలలో సాధారణం కంటే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి.
గరిష్ట స్థాయికి చేరుకుంటున్న డిమాండ్
ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వాడకం అధికంగా జరుగుతుండటంతో సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈపీడీసీఎల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఐదు సర్కిళ్ల పరిధిలో జూలై నెలలో ప్రతి గంటకు 3,700 నుంచి 3,800 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది జూలైలో మాత్రం రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 16న రాత్రి 9.38 గంటల సమయంలో ఏకంగా 4,737 మెగావాట్లకు చేరుకోవడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. గతేడాది ఇదే సమయంలో 3,716 మెగావాట్లు మాత్రమే వినియోగం జరగగా.. ఈ సారి 1000 మెగావాట్స్ అదనపు భారం పడింది. డిమాండ్‌కు మించి సరఫరా ఉండటంతో అధికారులు లోటు భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటల సమయంలోనూ డిమాండ్ పీక్స్‌కు చేరుకుంటోంది. ఒకే సమయంలో అందరూ ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో లోడ్ పెరిగి ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇదే అదనుగా కోతలకు ఈపీడీసీఎల్ అధికారులు పనిచెప్పారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు కూడా గరిష్టంగానే పెరిగాయని ప్రజలు వాపోతున్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలో రికార్డు స్థాయిలో
విద్యుత్ వినియోగం
జూలైలో 16న 97 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం
ఈనెలలో ప్రతిరోజూ సగటు వినియోగం 92 మి.యూనిట్లకు చేరిక
20 మిలియన్ యూనిట్లు అదనంగా..
ఈపీడీసీఎల్ పరిధిలో జూలై నెలలో ప్రతి రోజూ సగటున 72 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగుతుంటుంది. అయితే భానుడి ప్రతాపంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జూలై 10 నుంచి కరెంట్ వినియోగం భారీగా పెరుగుతూ వస్తోంది. సగటు విద్యుత్ వినియోగం రోజుకు 82 నుంచి 92 మిలియన్ యూనిట్లుగా మారిపోయింది. జూలై 16న ఏకంగా 97 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడేశారంటే.. ఎండ తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈపీడీసీఎల్ పరిధిలో 10 రోజులుగా వినియోగం
(మిలియన్ యూనిట్లు)
తేదీ 2024 2025
12– జూలై 76.04 89.62
13– జూలై 73.38 88.48
14– జూలై 72.69 92.37
15–జూలై 72.86 94.82
16–జూలై 75.08 97.09
17–జూలై 75.32 93.44
18–జూలై 71.92 90.55
19–జూలై 65.46 88.73
20–జూలై 62.65 84.87

అదే స్పీడ్..!