
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే..
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం
బీచ్‌రోడ్డు : పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించడంతోపాటు తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి కార్మికులను, ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను, పరిశ్రమల నిర్వాహకులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ విభాగాల అధికారులు, పరిశ్రమల నిర్వాహకులతో కూడిన జిల్లా క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. పరిశ్రమల్లో అన్ని చోట్లా ఆటోమెటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కంపెనీల్లో పనిచేసే సిబ్బందికి, కార్మికులకు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించాలని, పీపీఈ కిట్లు అందజేయాలన్నారు. కంపెనీల్లో తరచూ సేఫ్టీ ఆడిట్లు చేపట్టాలని, పైప్ లైన్లు, విద్యుత్ వైరింగ్, ఇతర పరికరాలను తనిఖీ చేయాలని సూచించారు. ఆఫ్ సైట్, ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఎల్లప్పుడూ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని చెప్పారు. కార్మికులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని చోట్లా ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీంలను నిత్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్యాక్టరీల చీఫ్ ఇన్‌స్పెక్టర్ సురేష్, విశాఖ, భీమిలి ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, డీఎఫ్‌వో, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.