
సీఎస్సార్ నిధులతో ఆస్పత్రులు, హాస్టళ్ల అభివృద్ధి
కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్
బీచ్‌రోడ్డు: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) నిధులతో జిల్లాలోని ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి, సమర్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, విద్య, సంక్షేమ శాఖల అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం సమావేశమైన ఆయన సీఎస్సార్ నిధుల వినియోగం, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. అత్యవసర సేవలకు సంబంధించిన నివేదికలను త్వరితగతిన అందించాలన్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రికి తమ వద్ద ఉన్న అంబులెన్సుల్లో ఒకదాన్ని కేటాయించాలని కేజీహెచ్ అధికారుల్ని ఆదేశించారు. చెస్ట్, ఈఎన్‌టీ, మెంటల్ కేర్‌లో ఉండే పీజీ విద్యార్థుల సౌకర్యార్థం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించి, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్‌లో అదనపు డయాలసిస్ యూనిట్ల ఏర్పాటును ఇప్పటికే ప్రతిపాదించినట్లు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు బేసిక్ లెర్నింగ్ ఔట్‌కమ్స్ వచ్చేలా ప్రత్యేక ట్యూటర్లను నియమించుకునేందుకు అనుమతించారు.
● రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్య సాధనలో వైద్య రంగ అధికారులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ నిర్దేశించారు. ఆయా రంగాల్లో కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.