
కలెక్టరేట్ వద్ద ఆంక్షలతో మహిళల ఇబ్బందులు
మహారాణిపేట: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌కు వినతులు సమర్పించేందుకు వచ్చే సందర్శకులపై పోలీసుల అతి ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. పీజీఆర్‌ఎస్ జరిగే సమయంలో వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు నిరసన తెలపడానికి వస్తుండడంతో కలెక్టరేట్ రెండు ప్రధాన ద్వారాలకు బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరినీ అనుమతించకుండా, ఎవరైనా వెళ్లాల్సి వస్తే అనేక ప్రశ్నలు వేసి, సంతృప్తికరమైన సమాధానం చెబితేనే అనుమతిస్తున్నారు. లేకపోతే వెనక్కి పంపించే పరిస్థితి ఉంది. ఇది ముఖ్యంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను పోలీసులు ఇలా ప్రశ్నించి అనుమతులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.