
గొడవ వద్దన్నందుకు.. స్నేహితుడి హత్య
● ఆదివారం అర్ధరాత్రి ఘటన ● చికిత్స పొందుతూ ఎల్లా మృతి ● టూటౌన్ పరిధిలో వరుస ఘటనలతో ఆందోళన
అల్లిపురం: ‘గొడవలు ఎందుకు, సర్దుకుపోండి’ అని చెప్పినందుకు స్నేహితుడని కూడా చూడకుండా కత్తితో పొడిచి హతమార్చిన ఘటన నగరంలో సంచలనం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకాష్‌రావుపేటలో జరిగిన ఈ ఘటనతో నగరంలో శాంతిభద్రతలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల్లో రెండు ఘోర ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో యువకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేంకటేశ్వర మెట్టకు చెందిన చెట్టి ఎల్లాజీ అలియాస్ వట్టి (22), అయ్యప్ప ఇద్దరు స్నేహితులు. ఆదివారం రాత్రి 12 గంటల వరకు వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం అయ్యప్ప కెప్టెన్ రామారావు జంక్షన్ వైపు వెళ్లగా, ఎల్లాజీ డాబాగార్డెన్స్ వైపు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అయ్యప్ప, ఎల్లాజీకి ఫోన్ చేసి తనకు కెప్టెన్ రామారావు జంక్షన్‌లో ఒకరితో గొడవ జరుగుతోందని, రమ్మని పిలిచాడు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఎల్లాజీ, వారిద్దరికి నచ్చజెప్పి పంపించాడు. తిరిగి ఎల్లాజీ డాబాగార్డెన్స్ వైపు వెళ్తుండగా, అయ్యప్ప మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెనుక నుంచి వచ్చాడు. ప్రకాష్‌రావుపేట రోడ్డులోని జాకీ షోరూం దగ్గరలో ఎల్లాజీ వీపుపై బలంగా కత్తితో పొడిచాడు. దీంతో ఎల్లాజీ బైక్ వదిలి, రక్తం కారుతూ సుమారు వంద మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాడు. తన స్నేహితుడు గణేష్‌కు ఫోన్ చేయడంతో అతను అక్కడికి చేరుకుని, మరొక స్నేహితుడు అమర్‌తో కలిసి గాయపడ్డ ఎల్లాజీని కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న నైట్ రౌండ్స్ త్రీటౌన్ సీఐ పల్లా పైడయ్య, టూటౌన్ ఎస్.ఐ సతీష్‌లు కేజీహెచ్‌కు చేరుకుని ఎల్లాజీ నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎల్లాజీ మద్యం మత్తులో ఉండటంతో తనను చాకుతో పొడిచాడని మాత్రమే చెప్పగలిగాడు. డాక్టర్లు చికిత్స అందిస్తుండగానే ఎల్లాజీ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తెలిపారు.
వారంలో రెండు ఘటనలు
టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా రెండు ఘోర ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గంలో మద్యం దుకాణాల వద్ద విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండటంతో యువత పూటుగా మద్యం సేవిస్తున్నారు. ఆ మత్తులో గొడవలు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువత మద్యం మత్తులో తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై తక్షణమే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

గొడవ వద్దన్నందుకు.. స్నేహితుడి హత్య