
ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
మహారాణిపేట: విశాఖ కలెక్టరేట్ ధర్నాలు, నిరసలతో దద్దరిల్లింది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌సీ) సందర్భంగా సమస్యలపై వినతులు సమర్పించేందుకు వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు భారీగా తరలివచ్చారు. పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నినాదాలు చేశారు.
మద్యం దుకాణం తొలగించాలి
కంచరపాలెం రామ్మూర్తి పంతుల పేటలోని జనావాసాల మధ్య ఉన్న ‘మోనార్క్ వైన్స్’ను తొలగించాలని శ్రీ గౌరీ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. మద్యం దుకాణం వల్ల మందుబాబుల ఆగడాలు పెరిగాయని సంఘం అధ్యక్షుడు బొడ్డేటి చిన్న తెలిపారు.
బర్మా కాందిశీకుల భూముల పరిరక్షించాలి
కబ్జాదారుల నుంచి బర్మా కాందిశీకుల భూములను రక్షించాలని బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కప్పరాడలోని 9.5 ఎకరాల భూమిలో నిర్మించాల్సిన 188 గృహాలకు సంబంధించి భూములు కబ్జాకు గురవుతున్నాయని సంఘం అధ్యక్షుడు ఎం. నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి
ఆనందపురం దబ్బందలోని టిడ్కో ఇళ్లకు వీధిలైట్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహ్మాన్ కోరారు. బ్యాంకు రుణాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ సహాయ కార్యదర్శి పి. చంద్రశేఖర్, నాయకులు సత్యనారాయణ, కార్యదర్శి ఎం.మన్మథరావు, అధిక సంఖ్యలో టిడ్కో గృహవాసులు పాల్గొన్నారు.

ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్

ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్