తాటిచెట్లపాలెం: సామాన్య, మధ్య తరగతి ప్రయాణికుల ప్రధాన రవాణా సాధనం రైలు. ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చుకుంటే తక్కువ చార్జీలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే కీలకం. రైల్వే చార్జీలు స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పెంచిన చార్జీలు నేటి(జూలై 1) నుంచి అమల్లోకి రానున్నాయి. సబర్బన్(సింగిల్ జర్నీ), సీజన్ టికెట్స్(సబర్బన్, నాన్ సబర్బన్), రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు.
ఆర్డినరీ నాన్ ఏసీ(నాన్–సబర్బన్)
సెకండ్ క్లాస్ మొదటి 500 కి.మీ.లకు మార్పులేదు. ఆపై కి.మీ.కు 0.5(అర) పైసా చొప్పున పెంచారు. 501 నుంచి 1500 కి.మీ. వరకు రూ.5, 1501 నుంచి 2500 కి.మీ. రూ.10, 2501 నుంచి 5 వేల కి.మీ. వరకు రూ.15 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కి.మీ.కు అర పైసా చొప్పునే పెరుగుదల ఉంది.
మెయిల్ ఎక్స్‌ప్రెస్(నాన్–ఏసీ): సెకండ్ క్లాస్, స్లీప్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కేటగిరీలో కిలో మీటర్‌కు పైసా చొప్పున చార్జీలలు పెరిగాయి.
ఏసీ క్లాస్‌లు: ఏసీ చైర్‌కార్, 3 టైర్, 2 టైర్, ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ కిలో మీటర్‌కు 2 పైసలు చొప్పున పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.

పెరిగిన రైలు చార్జీలు