
విశాఖ అగ్రపీఠాధిపతికి పాల్లియం ప్రదానం
డాబాగార్డెన్స్: సెయింట్ పీటర్, సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌లకు 14వ లియో పోప్ పాల్లియంను దీవించి అందజేశారు. ఈ మహోత్సవంలో భారతదేశం నుంచి ముగ్గురు అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. వారిలో విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉడుముల బాల కూడా ఉన్నారు. కాగా.. పాల్లియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌కు అధికారిక చిహ్నంగా పరిగణిస్తారు. స్థానిక అగ్రపీఠ పరిధిలోని ఇతర మేత్రాసనములతో పోప్‌కు ఉండే సమైక్యతను ఇది ప్రతిబింబిస్తుంది. ఉడుముల బాల విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా నియమితులై ఈ గొప్ప గౌరవాన్ని పొందడం అగ్రపీఠానికే కాకుండా, యావత్ భారతదేశానికి గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.