
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఎన్డీఏలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 19 ద్వారా 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల కొన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 9,652 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 1,552 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసిన 779 ఉన్నత పాఠశాలలు, 5 వేల ఫౌండేషన్ పాఠశాలలు, 19 వేల బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన పాఠశాలలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల పనివేళల్లో బోధనేతర పనులు, శిక్షణ తరగతులు లేకుండా చూడాలని కోరారు. అదే విధంగా ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు డ్రైవ్ చేపట్టాలని, ఇందులో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలని కోరారు. కనీసం మండల స్థాయిలో 10 మంది పిల్లలను, జిల్లా స్థాయిలో 20 మంది పిల్లలను చేర్పించిన వారికి అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్.ప్రభాకర్, రొంగలి ఉమాదేవి, కోశాధికారి కె.రాంబాబు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి టి.అప్పారావు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, రియాజ్, సీనియర్ నాయకులు బి.జనార్ధన్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.