
ఆకట్టుకున్న చతుర్గుణిత అష్టావధానం
మద్దిలపాలెం: చతుర్గుణిత అష్టావధానం ప్రక్రియ డాక్టర్ బులుసు అపర్ణ ఆధ్వర్యంలో సాహిత్య శ్రావ్యనందకరంగా జరిగింది. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. నిషిద్ధాక్షరి, సమస్య దత్తపది, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, వారగణనం, అనువాదం, పురాణం అనే అంశాలపై 32 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బులుసు అపర్ణ అసాధారణ రీతిలో.. ఏకధాటిగా పద్యరూపంలో పూరణ చేసి సభికులను రంజింపజేశారు. దీంతో సభికులు తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపగా కళాభారతి మార్మోగిపోయింది. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్మూలూరి రాంబాబు, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ, కార్యదర్శి పేరాల సీతారాం ప్రభుతో కలిసి ముఖ్య అతిథి మధుర కవి డాక్టర్ బులుసు వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలనతో అవధాన ప్రక్రియను ప్రారంభించారు. ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ పేరి రవికుమార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ దాడి వీరభద్రరావు, ఆచార్య రామవరపు శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.