
కూటమిలో ‘వైన్ షాపు వార్’
మధురవాడ: కూటమిలోని అంతర్గత లుకలుకలు బయటపడుతున్నాయి. జీవీఎంసీ 5వ వార్డు, మారికవలస జంక్షన్, శారదానగర్ వద్ద వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కారు. దీనికి జనసేన, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జనసేన 5వ వార్డు అధ్యక్షుడు దేవర శివ మాట్లాడుతూ మారికవలస జంక్షన్ సర్వీస్ రోడ్డులో ఇప్పటికే ఒక వైన్ షాపు నివాసాలను ఆనుకొని ఉందని, ఇప్పుడు నివాసాల మధ్య, దానికి అత్యంత దగ్గరలో మరో దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఉన్న ఒక్క షాపుతోనే అనేక ఇబ్బందులు పడుతుంటే, రెండో షాపు ఏర్పాటుతో అవస్థలు రెట్టింపు అవుతాయని చెప్పారు. దీనిని ఆపకపోతే ఎటువంటి పోరాటానికై నా తాము సిద్ధంగా ఉంటామని శివ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు భారతి మాట్లాడుతూ ఉన్న షాపు వల్లనే ఇక్కడ మహిళలు తిరగలేకపోతున్నారన్నారు. తమకు మద్యం వద్దు, మంచి నీళ్లు కావాలని నినాదాలు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి మద్యం షాపు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇక్కడ రెండో వైన్ షాపు ఏర్పాటు చేస్తున్న షెడ్ టీడీపీ మాజీ కార్పొరేటర్‌కు చెందినది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన నాయకుడు రోడ్డెక్కి ధర్నాకు దిగడం గమనార్హం.