
కదిలిన జగన్నాథ రథం
కదిలొచ్చిన జనం
● వైభవంగా రథయాత్ర ప్రారంభం ● హరేకృష్ణ నామస్మరణతో భక్తుల నృత్యాలు ● నగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
కదిలిన జగన్నాథ రథచక్రాలతో నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరే కృష్ణ నామస్మరణలు, సంకీర్తనల హోరు.. రథచక్రాల గిరగిరలు.. భక్తుల కోలాహలం మధ్య భక్తి పారవశ్యంలో మునిగితేలింది. నగరంలో పలుచోట్ల జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగాయి. జై జగన్నాథ నినాదాలతో వీధులు మార్మోగాయి. ఈ ఆధ్యాత్మిక సందడిలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామి రథాన్ని లాగి తరించారు.
– డాబాగార్డెన్స్/ఎంవీపీకాలనీ
/బీచ్‌రోడ్డు
టౌన్ కొత్తరోడ్డులో..
185 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టౌన్‌కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రథయాత్ర శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వేదమంత్రాలు, గీతా పారాయణం, మేళతాళాలు, కోలాటం నడుమ టౌన్ కొత్తరోడ్డు, ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, పూర్ణామార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు రథయాత్ర సాగింది. అనంతరం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని టర్నర్ చౌల్ట్రీలోని కల్యాణ మండపంలోకి ఆహ్వానించారు. ఆలయ ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి రంగానాథాచార్యులు, జగన్నాథాచార్యులు, యేడిద సురేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. టర్నర్ చౌల్ట్రీ వేదికగా శనివారం నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం మత్స్యావతారంలో స్వామిని అలంకరిస్తామని ఈవో తెలిపారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో..
ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సాగర్‌నగర్ ఇస్కాన్ శాఖ అధ్యక్షుడు సాంబదాస్, మాతాజీ నితాయి సేవిని సారథ్యంలో సాయంత్రం 4 గంటలకు నాలుగు రథాలతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యాత్ర ప్రారంభమైంది. ఎల్‌ఐసీ, అంబేడ్కర్ కూడలి, డాబాగార్డెన్స్, ప్రెస్‌క్లబ్ జంక్షన్, జగదాంబ జంక్షన్, గ్రీన్‌పార్కు, వాల్తేర్ అప్‌రోడ్డు మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు యాత్ర సాగింది. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి వార్లను అధిష్టింపజేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబదాస్ జగన్నాథుడి ఔన్నత్యాన్ని వివరించగా, మాతాజీ నితాయి సేవిని స్వామి లీలలను ప్రవచించారు. భక్తులు తయారు చేసిన 1,008 రకాల ప్రసాదాలను స్వామికి నివేదించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. మహానగరంలో వరుసగా 18వ సారి ఈ యాత్రను వైభవంగా నిర్వహించినట్టు సాంబదాస్, మాతాజీ నితాయి సేవిని తెలిపారు. కో–ఆర్డినేటర్ ఎంవీ రాజశేఖర్, ఇస్కాన్ జీవితకాల సభ్యులు పాల్గొన్నారు.
ఉత్కళ్ సమాజ్ ఆధ్వర్యంలో..
ఉత్కళ్ సాంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో దసపల్లాహిల్స్‌లోని జగన్నాథ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. సమాజ్ అధ్యక్షుడు జె.కె.నాయక్ రథం ముందు కొబ్బరికాయ కొట్టి, మార్గాన్ని శుభ్రం చేసి యాత్రను ప్రారంభించారు. పుష్పాలతో అలంకరించిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు అధిష్టించాడు. భక్తుల కోలాహలం నడుమ ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, ఏయూ అవుట్‌గేట్, చినవాల్తేరు, వీఎంఆర్డీఏ పార్క్ మీదుగా లాసన్స్ బే కాలనీ వరకు యాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు.

కదిలిన జగన్నాథ రథం

కదిలిన జగన్నాథ రథం

కదిలిన జగన్నాథ రథం

కదిలిన జగన్నాథ రథం