
ఎమర్జెన్సీ కాలం చీకటి అధ్యాయం
బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి
సీతంపేట: బంగ్లాదేశ్ విమోచనతో శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీతో ప్రజల స్వేచ్ఛను హరించారని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎల్.ఎస్.తేజస్వి సూర్య ఆరోపించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్.పరశురామ్ అధ్యక్షతన ’చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు’ అనే అంశంపై పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో ఎంతో మందిని జైలు పాలు చేశారని, సుమారు కోటి మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దేశ ప్రజలకు చేసిన ద్రోహాలని తేజస్వి విమర్శించారు. ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన పరిస్థితులు, ప్రజలు పడ్డ కష్టాలను ఆయన వివరించారు. ఈ చీకటి అధ్యాయాన్ని నేటి యువత తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించిన పలువురిని ఘనంగా సన్మానించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధోని నాగరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ, బీజేపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి ఎ.కేశవకాంత్ తదితరులు పాల్గొన్నారు.