
దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్
సీతంపేట: నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. నేడు దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా విశాఖ, విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏది జరిగినా ముస్లింలే కారణమంటూ పాలకులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నేడు రాజకీయ నిరంకుశత్వంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ సాంస్కృతిక సైన్యం ఉందని, ఇది హిట్లర్ ప్రైవేట్ ఆర్మీలా తయారైందని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులు మోదీ ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్, కార్పొరేట్ శక్తుల కలయికతో దేశం అంధకారంలోకి వెళ్తోందని మండిపడ్డారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, మైనారిటీలను తప్పుదోవ పట్టించే ప్రమాదకర అజెండాను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న నరమేధాన్ని బయటకు రానివ్వడం లేదన్నారు. మానవహక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఎమర్జెన్సీని రాజ్యాంగ ధ్వంసంగా అభివర్ణిస్తుందని, కానీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించి, ప్రభుత్వ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. గత ఎమర్జెన్సీకి కార్పొరేట్ల మద్దతు లేదని, నేటి అనధికార ఎమర్జెన్సీకి వారి మద్దతు ఉందన్నారు. మీడియా పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి. శ్రీరామమూర్తి మాట్లాడుతూ దేశంలో పేదరికం, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు అణచివేత విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. 2014 నుంచి దేశంలో అనధికార ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి కె.పద్మ, ఇఫ్టూ నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.