
లోక్ అదాలత్‌తో తక్షణ పరిష్కారం
విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా
విశాఖ లీగల్ : న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ చేసుకోవడానికి మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా కోరారు. జూలై 5వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతం చేసే దిశగా అధికారులు, పోలీసు యంత్రాంగం, బీమా కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, వివిధ కంపెనీల న్యాయ సలహాదారులతో ఆయన మంగళవారం నూతన న్యాయస్థానాల సముదాయంలోని సమావేశంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలన్నారు. బీమా కంపెనీలు, పోర్ట్ ట్రస్టు, స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, రాజీ కాగలిగిన క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజీమార్గమన్నారు. కార్యక్రమంలో కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి రాధారత్నం, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి సి.కె.గాయత్రి, లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, నగర పోలీస్ నేర విభాగం డిప్యూటీ పోలీసు అధికారి మాధవీలత, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వివిధ కంపెనీల న్యాయ సహాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.