
ఘనంగా ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం
సింధియా: ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్.. హైడ్రోగ్రఫీ ప్రాముఖ్యతను వివరించారు. ఇటీవల అత్యాధునిక సర్వే నౌకలను ప్రారంభించిన రెండు రాష్ట్రాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో గీతం, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు, వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (విస్టమ్), నేవీ చిల్డ్రన్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు కలిపి మొత్తం 300 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరు నావికాదళంలోని వివిధ నౌకలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే యూనిట్లు, నావల్ చార్ట్ డిపోలను సందర్శించారు. సముద్ర గర్భ డేటాను సేకరించే అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలను, అవి సముద్ర, జాతీయ భద్రతకు ఏ విధంగా ఉపయోగపడతాయో నౌక సిబ్బంది విద్యార్థులకు వివరించారు. అనంతరం కమొడోర్ ఎ.మురళీధర్ నావికాదళ సిబ్బందికి హైడ్రోగ్రఫీ, సముద్ర సరిహద్దులపై అవగాహన కల్పించారు. విదేశీ సహకార సర్వేల ద్వారా హిందూ మహాసముద్రంలో భారత నావికాదళ హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల పరిధిని విస్తరించినట్లు నేవీ వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి.