
ఏయూ లా విద్యార్థి సోమశేఖర్ అరుదైన రికార్డు
ఏడు సెంట్రల్ యూనివర్సిటీల్లో టాప్ ర్యాంకులు
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న కొండేటి సోమశేఖర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో అసాధారణమైన ప్రతిభ చూపించాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా నిర్వహించిన కామన్(సెంట్రల్) యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష– పీజీ (సీయూఈటీ–పీజీ 2025)లో సోమశేఖర్ నాయశాస్త్ర విభాగంలో 155 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల మెరిట్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియలో సోమశేఖర్ ఏడు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జనరల్ కేటగిరీలో టాప్ ర్యాంకులు దక్కించుకున్నాడు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ జనరల్ కేటగిరీలో 4వ ర్యాంక్, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో 6వ ర్యాంక్, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో 8వ ర్యాంక్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో 8వ ర్యాంక్, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో 14వ ర్యాంక్, మధ్యప్రదేశ్ డాక్టర్ హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీలో 42వ ర్యాంక్, సౌత్ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీలో మెరిట్ లిస్టులో స్థానం సంపాదించాడు. ఈ ర్యాంకులతో కొండేటి సోమ శేఖర్‌కు 7 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి ఎల్‌ఎల్‌ఎమ్ ప్రవేశానికి అవకాశం లభించింది. అయితే సోమశేఖర్ యూనివర్సిటీల మెరిట్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్ ఆధారంగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీని ఎంపిక చేసుకుని ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశం పొందాడు.