
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
మహారాణిపేట: జర్నలిస్టుల పిల్లలకు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) భవానీ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీపై ఉత్తర్వులు జారీ అయ్యాయని, విశాఖ జిల్లాలోనూ వంద శాతం రాయితీ కల్పించాలని జర్నలిస్టు నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణ్‌లు డీఆర్‌వోను కోరారు. గతంలో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని పాఠశాలలు ఫీజు రాయితీని నిరాకరించాయని తెలిపారు. జర్నలిస్టుల వినతిపై డీఆర్‌వో సానుకూలంగా స్పందించి, డీఈవో ప్రేమ కుమార్‌ను పిలిచి ఉత్తర్వులు పరిశీలించి తక్షణమే కలెక్టర్‌కు ఫైల్ పంపాలని ఆదేశించారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల విషయం కలెక్టర్ దృష్టిలో ఉందని, త్వరలో చర్యలు తీసుకుంటారని డీఆర్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్‌కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.