
జాబ్ లేదు.. భృతి రాదు
● ఫీజు రీయింబర్స్‌మెంట్,వసతి దీవెనకు దిక్కే లేదు.. ● నేటి ‘యువత పోరు’ను విజయవంతం చేయండి ● వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఇంటికొక ఉద్యోగం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీకి తూట్లు పొడిచిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవ్వకుండా అడుగడుగునా దగా చేసిందన్నారు. యువతకు, నిరుద్యోగులకు ఇస్తానన్న హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసనగా.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 23వ తేదీన వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘యువత పోరు’ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గల కృష్ణమందిర్ జంక్షన్ నుంచి పాదయాత్రగా బయలుదేరి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేస్తామన్నారు. అక్కడ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.