
భీమిలి అర్చకుడు తిరుపతిలో అదృశ్యం
58 రోజులుగా ఆచూకీ లేదు
తగరపువలస: భీమిలి పట్టణంలోని భ్రమరాంబికా సహిత చోడేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఏడిద గణేష్ సుబ్రహ్మణ్య శాస్త్రి (49) 58 రోజుల కిందట తిరుపతిలో అదృశ్యం కాగా.. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. భీమిలి ప్రధాన రహదారిలో తన భార్య మాధురి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఆయన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత ఏప్రిల్ 24న కుటుంబ సభ్యులకు చెప్పి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన అర్చకుడు, ఏప్రిల్ 26న తన భార్య మాధురికి ఫోన్ చేసి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆయన ఆచూకీ తెలియరాలేదు. అక్కడి పోలీసుల సాయంతో ఈ నెల 13న భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ మిస్సింగ్ కేసుపై ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. ఇటీవల భీమిలికి చెందిన వివాహిత బంగారు కవిత కూడా ఇదే విధంగా అదృశ్యమైన తర్వాత బంధువులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె మృతదేహం పూర్తిగా శిథిలమైన పరిస్థితిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద ఉన్న జీడితోటలో కనిపించింది. అర్చకుడి మిస్సింగ్ విషయంలో పోలీసులు గానీ, బంధువులు గానీ ఎలాంటి ఆతృత కనబరచకపోవడంతో.. దీని ముగింపు ఏమవుతుందోనని పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.