
మద్యం మత్తులో ఒకరి హత్య
● హంతకుడు పరారీ ● గాలిస్తున్న న్యూపోర్టు పోలీసులు
పెదగంట్యాడ : మండలంలోని ఏిపీఐఐసీ (ఐలా) ఆటోనగర్‌లో మహాదేవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌లో గల భవానీయార్డ్ అనే స్టీల్ ట్రేడర్స్‌లో ఛత్తీస్‌గఢ్ జగదల్‌పూర్‌కి చెందిన మహాదేవ్ (28), నరేష్ (29) కొన్నాళ్లగా రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నారు. ఇద్దరూ ఆ యార్డ్‌లోనే ఓ షెడ్‌లో ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇద్దరూ ఉదయం నుంచి మద్యం సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య ఏమి జరిగిందో గానీ మహాదేవ్ తలపై నరేష్ కర్రతో బలంగా కొట్టి హత్య చేశాడు. ఆ పై మృతదేహన్ని పక్కనున్న తుప్పల్లో పడేశాడు. అక్కడ నుంచి జారుకున్నాడు. ఆదివారం రాత్రి అటుగా వెళ్తున్న కార్మికులు తుప్పల్లో మృతదేహాన్ని చూసి న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తోటాడ కామేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నరేష్ పరారీ కావడంతో అతని కోసం గాలిస్తున్నారు.