తిండి లేదు.. నిద్ర లేదు | - | Sakshi
Sakshi News home page

తిండి లేదు.. నిద్ర లేదు

Jun 22 2025 3:11 AM | Updated on Jun 22 2025 3:11 AM

తిండి

తిండి లేదు.. నిద్ర లేదు

● యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల అష్టకష్టాలు ● వసతి లేక ఇబ్బందులు.. గ్రౌండ్‌, బస్సుల్లోనే విద్యార్థుల నిద్ర ● బురదలోనే భోజనాలు, తాగునీటి కోసం పాట్లు ● 5 వేల మందికి 10 టాయిలెట్లు.. కంపుతో అల్లాడిన చిన్నారులు ● అర్ధాకలి.. నిద్రలేక నీరసించినా గిన్నిస్‌ రికార్డు కొట్టిన విద్యార్థులు

విశాఖ సిటీ: యోగాంధ్ర పేరుతో కూటమి ప్రభుత్వం అభం శుభం తెలియని గిరిజన విద్యార్థులను అష్టకష్టాలు పెట్టింది. గిన్నిస్‌ రికార్డు పేరుతో అల్లూరి జిల్లా నుంచి వేల మంది చిన్నారులను నగరానికి తీసుకొచ్చి సరైన వసతి కల్పించకుండా నరకం చూపించింది. సక్రమంగా భోజనం పెట్టకుండా.. నిద్రపోవడానికి వసతి ఏర్పాటు చేయకుండా రోడ్డు పాలు చేసింది. విద్యార్థులు అర్థాకలితో అలమటించారు. భోజనాల వద్ద తోపులాటల్లో నలిగిపోయారు. బురదలోనే భోజనాలు, టిఫిన్లు చేశారు. టాయిలెట్ల కోసం క్యూ కట్టారు. కంపు భరించలేక అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం ట్యాంక్‌ వద్ద ఎగబడ్డారు. అపరిశుభ్రమైన నీటితోనే గొంతులు తడుపుకున్నారు. యోగాసనాలు వేసేంత వరకు ఎండలోనే పడిగాపులు కాశారు. రాత్రి గ్రౌండ్‌, బస్సుల్లోనే నిద్రించారు. కూటమి ప్రభుత్వం సరైన వసతి సౌకర్యాలు కల్పించకపోయినప్పటికీ.. సగం నిండిన కడుపులతో.. ఎండ వేడికి గొంతెండుతున్నా.. నిద్ర లేక నీరసించినా.. 25 వేల మంది విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించారు.

విద్యార్థుల హాహాకారాలు

అల్లూరి జిల్లా నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాసనాలు చేయించి రికార్డు సాధించాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఇందుకోసం గురువారం రాత్రికే కొంత మంది గిరిజనులను ఇక్కడకు తీసుకువచ్చింది. కానీ రాత్రి వసతి ఏర్పాట్లు చేయలేదు. సక్రమంగా భోజనాలు అందించలేదు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అర్థాకలితోనే ఉన్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ మైదానంలోనే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ నిద్రపోయారు. మరుసటి రోజు శుక్రవారం తెల్లవారుజామున మరికొంత మంది విద్యార్థులను అల్లూరి జిల్లా నుంచి నగరానికి తీసుకొచ్చారు. వీరికి కూడా మధ్యాహ్నం సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయలేదు. 25 వేల మంది పిల్లలను తీసుకొచ్చి ఎండలోనే ఐదు కౌంటర్లలో భోజనాలు వడ్డించారు. దీంతో విద్యార్థులు గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వచ్చింది. రోడ్డు మీదే భోజనాలు చేశారు. అనంతరం చేతులు కడుక్కోడానికి మంచినీటికి కూడా లైన్లలో నిలబడాల్సి వచ్చింది.

బురదలోనే భోజనాలు.. కంపుకొట్టిన టాయిలెట్లు

శనివారం ఉదయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. 5 వేల మందికి వేసిన ఒక్కో టెంట్‌కు కేవలం 10 తాత్కాలిక టాయిలెట్లు మాత్ర మే ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 25 వేల మందికి టెంట్లు వేశారు. దీంతో ఉదయం చిన్నారులు కాలకృత్యాలు తీర్చుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టాయిలెట్లను శుభ్రం చేసే వారు లేక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. అయినప్పటికీ మరో దారి లేక ముక్కు మూసుకుంటూనే వెళ్లాల్సి వచ్చింది. అలాగే దాని పక్కనే టిఫిన్లు ఏర్పాటు చేశారు. బాత్‌రూమ్‌ల నుంచి వచ్చిన నీటితో బురదమయంగా మారిన గ్రౌండ్‌లోనే చిన్నారులు అల్పాహారం తిన్నారు. విద్యార్థులకు వాటర్‌ బాటిళ్లు అందించకుండా వాటర్‌ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేశారు. తీసుకొచ్చిన వాటర్‌ కంటైనర్లు నిమిషాల్లోనే ఖాళీ అవడంతో చిన్నారులు వాటర్‌ ట్యాంకర్‌ వద్ద, డ్రమ్ముల్లో అడుగంటిన అపరిశుభ్రమైన నీటిని తాగారు.

తిండి లేదు.. నిద్ర లేదు 1
1/2

తిండి లేదు.. నిద్ర లేదు

తిండి లేదు.. నిద్ర లేదు 2
2/2

తిండి లేదు.. నిద్ర లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement