
స్తంభించిన ప్రజా రవాణా
తగరపువలస: యోగాంధ్ర కారణంగా శుక్రవారం తగరపువలస పరిసర ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచి ఆర్టీసీ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది. కూర్మన్నపాలెం, గాజువాక, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి తగరపువలస మీదుగా విజయనగరం వరకు నడిచే సిటీ బస్సులు, అలాగే విశాఖపట్నం నుంచి విజయనగరం, శ్రీకాకుళం మధ్య తిరిగే పల్లెవెలుగు బస్సులు రోజంతా కనిపించకుండా పోయాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించకపోవడంతో విశాఖ నుంచి అటువైపు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బస్సులను నిలిపివేయడం వల్ల వైద్య అత్యవసరాల నిమిత్తం వెళ్లేవారు, అలాగే విశాఖ, విజయనగరంలో రైళ్లు అందుకోవాల్సిన వారు నరకయాతన అనుభవించారు. సాధారణంగా బస్సులతో కిక్కిరిసి ఉండే బస్టాండ్‌లు ఖాళీగా కనిపించడంతో వింత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన చిరు వ్యాపారులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చింది. శనివారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.