
సమన్వయంతో రికార్డ్ సృష్టిద్దాం
మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి
బీచ్‌రోడ్డు: సమన్వయంతో యోగాంధ్ర వేడుకలను విజయవంతం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధిద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కంపార్ట్‌మెంట్ ఇన్‌చార్జిలు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్‌లు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై గురువారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. యోగాంధ్ర రాష్ట్ర నోడల్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించామని, కంపార్ట్‌మెంట్‌లో సుమారు 600 నుంచి 1,300 మంది వరకు ఉంటారన్నారు. యోగా ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఐదు పడకల ఆసుపత్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో పాములు, ఇతర విష కీటకాలు రాకుండా అటవీ శాఖ చేత మందులు పిచికారీ చేయిస్తున్నామని, అలాగే 35 మంది పాములు పట్టేవారిని సిద్ధం చేశామన్నారు. సముద్రంలో గజ ఈతగాళ్లు కూడా సిద్ధంగా ఉంటారన్నారు. రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్, కొలుసు పార్థసారధి, సత్యకుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పన, ఏసీఐఐసీ ఎండీ అభిషేక్, మూడు జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చికెన్ ధరలు