
విశాఖ అష్టదిగ్బంధం
● నగరం.. పోలీసుల వలయం ● రాష్ట్ర నలుమూలల నుంచి 10 వేల మంది పోలీసుల రాక ● యోగాంధ్రకు పటిష్ట భద్రతా చర్యలు ● రెండో రోజు స్తంభించిన ట్రాఫిక్ ● జాతీయ రహదారిపై వాహనదారులకు చుక్కలు ● ప్రధాని వెళ్లే మార్గంలో ట్రయల్ రన్ ● ఆ సమయంలోనూ వాహనాల నిలిపివేత ● ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు
IIలో
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
విశాఖ సిటీ : యోగాంధ్ర కార్యక్రమం సందర్భంగా విశాఖ నగరం పోలీసుల అష్ట దిగ్బంధంలోకి వెళ్లింది. అంతర్జాతీయ యోగా వేడుకలకు నగరం ఆతిథ్యమిస్తోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగా దినోత్సవంలో సుమారు 5 లక్షల మంది ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో యోగాసనాలు వేయనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఐపీఎస్‌లతో పాటు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందిని విశాఖలో మోహరించారు. 10 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విశాఖ సిటీ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. నగరంలో పీఎం, ఇతర ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలతో పాటు యోగాసనాలు వేసే బీచ్ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వైపుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ట్రయన్ రన్‌తో మరింత ట్రాఫిక్ కష్టాలు
ఈ నెల 20వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తూర్పు నావికాదళం హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఐఎన్‌ఎస్ డేగా నుంచి ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయం వరకు ప్రధాని వెళ్లే మార్గంలో గురువారం పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో ఆఫీసులు, ఇతరత్రా పనులకు వెళ్లేవారు అధిక సమయం జంక్షన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రముఖుల పర్యటన సమయంలో ట్రయల్ రన్ నిర్వహించడం సర్వ సాధారణమైనప్పటికీ.. వరుసగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తుండడం, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండడంపై వాహనదారులు విసుగెత్తిపోతున్నా రు. గత రెండు రోజులుగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండడంతో స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగా లు, ఇతర పనులకు వెళ్లే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నగరంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
హనుమంతవాక కూడలి వద్ద ట్రాఫిక్
వాహనదారులకు నరకం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమం విశాఖవాసులకు నరకం చూపిస్తోంది. బీచ్ రోడ్డుతో పాటు అటువైపుగా వెళ్లే రహదారుల్లో సైతం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా ప్రయాణించే అవకాశం లేదు. వాహనదారులందరూ జాతీయ రహదారిపైకి ఎక్కారు. దీంతో రెండో రోజు కూడా హైవేలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మద్దిలపాలెం నుంచి పీఎం పాలెం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సాధారణ రోజుల్లో పీఎంపాలెం నుంచి మద్దిలపాలెంకు 20 నుంచి 30 నిమిషాలు పట్టేది. కానీ బుధ, గురువారాల్లో మాత్రం రెండు గంటలకు పైగా పట్టింది. ఈ నెల 21వ తేదీ వరకు బీచ్ రోడ్డు వైపు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ముందుగానే సూచించారు. అయితే నగరంలో చాలా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోడ్లు లేవు. జోడుగుళ్లపాలెం నుంచి సాగర్‌నగర్ వరకు, అలాగే అక్కడి నుంచి భీమిలి వరకు ఉన్న నివాసితులు బీచ్‌రోడ్డు లేదంటే జాతీయ రహదారిపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. హనుమంతవాక జంక్షన్ దాటిన తర్వాత ఆనందపురం వరకు పెందుర్తి, ఆనందపురం హైవేకు వెళ్లే అవకాశం లేదు. దీంతో భీమిలి, తగరపువలస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, ఇతర కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బీచ్ రోడ్డులో నివాసితులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

విశాఖ అష్టదిగ్బంధం

విశాఖ అష్టదిగ్బంధం