
తుది దశకు ఏర్పాట్లు
ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్.కె బీచ్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదిక దాదాపు పూర్తయింది. కార్యక్రమాన్ని తిలకించే అతిథుల కోసం కుర్చీలు, ప్రత్యేక ఎల్‌ఈడీ టీవీలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్.కె బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు రహదారిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సాగర తీరాన్ని హరితమయం చేస్తున్నారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే ప్రజల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. తీరం పొడవునా భారీ ఎల్‌ఈడీ తెరలు, లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. ఇసుక తిన్నెలపై కూడా భారీ వేదిక, ఎల్‌ఈడీ తెరలు, లైట్లు అమరుస్తున్నారు. శుక్రవారం పూర్తిస్థాయిలో కంపార్ట్‌మెంట్‌ల నిర్మాణం, గ్రీన్ మ్యాట్ వేసే పనులు ప్రారంభం కానున్నాయి. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రధాన వేదికపై పైకప్పు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కూడా వేదిక, ఇతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రెండు ప్రధాన వేదికల వద్ద యోగా చేసే ప్రజల కోసం బారికేట్లు, కంపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు.