
అడ్మిషన్లలో వెనుకబడి
● వెలవెలబోతున్న అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల ● ‘కూటమి’ నిర్లక్ష్యంతోపడిపోయిన ప్రవేశాలు ● ఇదీ చంద్రంపాలెం హైస్కూల్ దుస్థితి
మంత్రి హామీ ఏమైంది?
ఆరు నెలల కిందట చంద్రంపాలెం పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. మైదానంలో వర్షపు నీరు నిలిచిపోయే సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నేటికీ పరిస్థితిలో మార్పు లేదు. గత ప్రభుత్వం హయాంలో మొదలైన 10 అదనపు తరగతి గదుల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. అడ్మిషన్ల సంఖ్య అనుకున్న విధంగా జరగకపోవడంతో ఆలస్యంగా మేల్కొన్న పాఠశాల యాజమాన్యం.. అడ్మిషన్ల కోసం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఉపాధ్యాయ బృందాలు ఇప్పుడు చుట్టుపక్కల కాలనీల్లో ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించమని అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా తిరోగమనంలో పయనిస్తున్నాయో చెప్పడానికి చంద్రంపాలెం పాఠశాల ప్రస్తుత పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.
మధురవాడ: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా తయారైంది రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వేల అడ్మిషన్లతో కళకళలాడిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. నేడు విద్యార్థుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యారంగంపై చూపుతున్న నిర్లక్ష్యానికి ప్రస్తుతం ఈ పాఠశాలలో పడిపోయిన అడ్మిషన్ల సంఖ్యే నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యార్థుల సంఖ్య పరంగా అతిపెద్ద పాఠశాలగా రికార్డు సృష్టించిన ఈ స్కూల్‌లో ఏటా వేసవి సెలవుల్లోనే దాదాపు 30 శాతం అడ్మిషన్లు పూర్తయ్యేవి. గత విద్యా సంవత్సరాల్లో ప్రతి ఏటా సుమారు 1,000కి పైగా కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమై ఆరు రోజులు కాగా.. కేవలం 310 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఈ గణాంకాలను చూస్తేనే అర్థమవుతుంది అడ్మిషన్ల పరిస్థితి ఏ విధంగా ఉందోనని.
ప్రభుత్వ వైఫల్యాలే కారణమా?
గతంలో వేసవిలోనే ప్రత్యేక కార్యాచరణతో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేవారు. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకం అడ్మిషన్ల పెరుగుదలకు దోహదపడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం అమలు చేయలేదు. దీంతో తల్లిదండ్రులు నిరాశ చెందారు. ఈ ప్రభావం అడ్మిషన్లపై పడింది. ఈ ఏడాది పలు నిబంధనలు విధించి కొందరికే తల్లికి వందనం అమలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
జెడ్పీ ఉన్నత పాఠశాల, చంద్రంపాలెం
విద్యార్థుల సంఖ్య 3,239
ఉపాధ్యాయుల సంఖ్య 104
తరగతి గదులు 62
సెక్షన్‌లు 62
అడ్మిషన్ల కోసం ఏడు ప్రత్యేక బృందాలు
ప్రస్తుతం అడ్మిషన్ల సరళిని చూస్తే గతేడాది కంటే తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాం. ఏడు సబ్జెక్ట్‌లకు సంబంధించిన ఉపాధ్యాయులతో ఏడు బృందాలు ఏర్పాటు చేశాం. మారికవలస ఆర్‌జీకే కాలనీ, సాయిరాం కాలనీ, శివశక్తినగర్ రోడ్డులోని పలు కాలనీలు, స్వతంత్రనగర్, సేవా నగర్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కొమ్మాది కాలనీలు, పీఎం పాలెం, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. టీసీలు లేకపోయినా 8వ తరగతి వరకు అడ్మిషన్లు ఇస్తున్నాం. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రైవేట్ స్కూళ్ల నుంచి టీసీలు త్వరగా ఇప్పించేలా చూస్తాం.
– ములుగు వెంకటరావు, ప్రధానోపాధ్యాయుడు
గత మూడేళ్లలో అడ్మిషన్లు ఇలా..
2022–23 950
2023–24 1,100
2024–25 1,200
ఈ ఏడాది ఇప్పటివరకు 310

అడ్మిషన్లలో వెనుకబడి

అడ్మిషన్లలో వెనుకబడి