
స్టీల్‌ప్లాంట్ సమ్మెకు జేఏసీ మద్దతు
● కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి.. బకాయిలకు జమ చేసుకుంది ● జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ గళమెత్తింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకోవడం కోసం ఈ నెల 20న శాశ్వత కార్మికులు, 20 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌లోని వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని.. పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్‌ఎస్ పేరుతో ఇళ్లకు పంపిస్తోందని మండిపడ్డారు. రూ. 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ఆ నిధులను కార్మికుల జీతభత్యాలకు, ప్లాంట్ అభివృద్ధికి వినియోగించకుండా ఆంక్షలు పెట్టిందన్నారు. రూ.9,654 కోట్లను కేంద్ర జీఎస్టీకి, బ్యాంకు బకాయిలకు జమ చేసుకుందని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని హామీలిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఇప్పుడు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ సమ్మెకు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ నెల 18న నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్రలు, బైక్ యాత్రలు, 19న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వద్ద నిరసనలు, 20న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన, సభ నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నాగభూషణం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, సీఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షుడు ఎ.కనకారావు, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.అనిల్‌కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

స్టీల్‌ప్లాంట్ సమ్మెకు జేఏసీ మద్దతు