
లారీని ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయలు రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలివి. ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంగారు రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున ఆనందపురం కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలను తన ఆటోలో వేసుకుని నగరంలోని పెదవాల్తేరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో ఎండాడ కూడలికి సమీపంలోని వరాహగిరి కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమణ నడుపుతున్న ఆటో ముందు అతివేగంగా వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఊహించని ఈ పరిణామానికి రమణ తన ఆటోను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.