
మశకం వేటకుహైటెక్ ప్లాన్
డాబాగార్డెన్స్: దోమ చిన్నదే.. అది కుడితే ప్రాణాలే పోతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గతంలో వర్షాలు మొదలు కాగానే దోమలు విజృంభించేవి. కానీ ఇప్పుడు ఏడాదంతా దాడి చేస్తున్నాయి. రాత్రయితే దోమల మోత మోగుతోంది. నగరంలో దోమల బెడద తీవ్రం కావడంతో పౌరులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో దోమల నియంత్రణకు సంప్రదాయ పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఆధారిత ‘మస్కి టో’ అనే సంస్థ అభివృద్ధి చేసిన మస్కిటో ట్రాప్ మెషీన్లను నగరంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ యంత్రాల పనితీరును అధ్యయనం చేసేందుకు జీవీఎంసీ అధికారుల బృందం తిరువనంతపురం, హైదరాబాద్‌లలో పర్యటించనుంది. అక్కడి అనుభవాలను, యంత్రాల పనితీరును విశ్లేషించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనుంది.
జోన్–4, జోన్–5లో పైలట్ ప్రాజెక్టు?
తిరువనంతపురం, హైదరాబాద్‌లలో ఈ యంత్రాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే విశాఖలోను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా జోన్–4, జోన్–5లలో సుమారు 120 మస్కిటో ట్రాప్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని సంబంధిత సంస్థ నివేదికలో పేర్కొంది. మరోవైపు దోమల నియంత్రణలో భాగంగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఈ డ్రైవ్ కోసం కాంట్రాక్టు పద్ధతిలో 400 మంది సిబ్బందిని నియమించి.. వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దోమల వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వీరు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
సాంకేతికతతో నియంత్రణ
సాంకేతికత సాయంతో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. మస్కిటో ట్రాప్ మెషీన్ల ద్వారా దోమల నివారణతో పాటు ఏ ప్రాంతాల్లో ఎటువంటి వ్యాధికారక దోమలు ఉన్నాయో గుర్తించడం సులభతరం అవుతుంది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టవచ్చు. అధికారుల అధ్యయనం అనంతరం ఈ ప్రాజెక్టుపై కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
–డాక్టర్ నరేష్‌కుమార్, ప్రధాన వైద్యాధికారి, జీవీఎంసీ
సాంకేతిక పరిజ్ఞానంతో దోమల నియంత్రణకు చర్యలు సన్నద్ధమవుతున్న జీవీఎంసీ ‘మస్కిటో’ కంపెనీతో
ఒప్పందానికి ఆలోచన
ఎలా పనిచేస్తుందంటే.?
దోమలు మనుషుల శ్వాస, వాసనలు పసిగట్టి కుడతాయి. ఇదే సిద్ధాంతంతో ఈ ట్రాపర్ మిషన్ పనిచేస్తుంది. ఈ అత్యాధునిక యంత్రాలు మనుషుల శ్వాస, శరీర ఉష్ణోగ్రత, వాసనలను అనుకరించడం ద్వారా దోమలను ఆకర్షిస్తాయి. యూవీ కిరణాలు, కార్బన్ డయాకై ్సడ్ విడుదల, 39–40 డిగ్రీల ఉష్ణోగ్రతతో సుమారు 500 మీటర్ల దూరం వరకు దోమలను వలలోకి రప్పిస్తాయి. అలా యంత్రంలో చిక్కిన దోమలు లోపల ఉన్న ఫ్యాన్ గాలికి ఎయిర్‌బ్యాగ్‌లోకి వెళ్లి చనిపోతాయి. ఫలితంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో దోమలు అధికంగా ఉన్నాయి? ఏ రకం దోమల వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇవి ‘క్యాచ్(పట్టుకోవడం), కౌంట్(లెక్కించడం), క్లాసిఫై(వర్గీకరించడం)’అనే మూడు ప్రధాన పనులు చేస్తాయి. యంత్రాల్లో ఉపయోగించే సువాసనతో కూడిన ద్రవాలు, సెన్సర్ల సాయంతో దోమలను ఆకర్షించి, వాటిని వర్గీకరించి వ్యాధి కారక దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడతాయి.