
కూటమి నేతల అండతో యథేచ్ఛగా ఇసుక దందా!
తగరపువలస: అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలను బుధవారం జిల్లా క్వారీ, లారీ యజమానుల సంఘంతో పాటు స్థానిక లారీ సంఘాల యజమానులు చెరకుపల్లి వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఇసుక రీచ్ నుంచి 35 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలపై 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నట్టు గుర్తించిన జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు మద్దిల వెంకటరమణ, మిగిలిన యజమానులతో కలిసి ఉదయం 4 గంటల నుంచి కాపు కాశారు. ఉదయం 6 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్తున్న మూడు లారీలను అడ్డుకున్నారు. వాటి సిబ్బంది మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర పేర్లు చెప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కదలనీయలేదు. తగరపువలస ఫ్లై ఓవర్ వద్ద మరొక లారీని కూడా నిలిపివేశారు. సుమారు 10 గంటల సమయంలో భీమిలి పోలీసులు వచ్చి బేషరతుగా లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మద్దిల వెంకటరమణను బెదిరించినట్టు తెలిసింది. తన ఇసుక లారీలను అడ్డుకుంటే ఎఫ్‌ఐఆర్ వేయిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. అనంతరం స్థానిక లారీ యజమానులు మాట్లాడుతూ రెట్టింపు లోడుతో ఇసుకను రవాణా చేస్తున్నా.. రవాణా శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెట్టింపు లోడుతో వాహనాలకు ప్రమాదాలు జరిగితే ఇరు పార్టీలకు బీమా పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ సంస్థలు అంగీకరించవని చెప్పారు. లారీపై ఇసుకను పూర్తిగా కప్పివేయకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. అదనపు లోడు కారణంగా తరచూ టైర్లు ఒత్తిడికి గురై రన్నింగ్‌లో పేలిపోతుండటంతో వెనుక వచ్చే వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. అధిక లోడును పట్టించుకోకుండా ఉండేందుకు మూడు జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు నెలకు రూ.22 వేలు వంతున ఒక్కో లారీ యజమాని నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. ఇప్పుడు దౌర్జన్యంగా కూటమి నాయకుల అండతో ఇసుకను అధిక లోడుతో రవాణా చేస్తూ.. తమను నిలువునా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన లారీ యజమానులతో సమావేశమై అధిక లోడుతో వచ్చే వాహనాలను ఇకపై కూడా అడ్డుకుంటామని లారీ యజమానులు బొట్ట సురేష్, కొయ్య శ్రీనివాసరెడ్డి, కర్రి రమణ, తుపాకుల సురేష్, వీడీఎం గిరి, మద్దిల శ్రీను హెచ్చరించారు.
అధిక లోడుతో లారీల్లో దర్జాగా
ఇసుక రవాణా
మంత్రులు లోకేష్, రవీంద్ర పేర్లు
చెప్పి వెళ్లేందుకు ప్రయత్నం
రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, మామూళ్ల వసూళ్లపై ఆరోపణలు