
మారుతున్న పరిస్థితులకు సాంకేతికతే పరిష్కారం
ఎన్‌ఎస్టీఎల్‌లో జాతీయ సాంకేతిక దినోత్సవం
గోపాలపట్నం: మారుతున్న పరిస్థితులను బట్టి సాంకేతికత వృద్ధి చెందాలని, వాటి పురోగతులే సమస్యలకు పరిష్కారాలు అవుతాయని కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి సౌజన్ పి జాన్ అన్నారు. ఎన్‌ఎస్టీఎల్‌లో సోమవారం జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కొచ్చిలో వాటర్ మెట్రో ఎలా ప్రారంభమైంది, విజయవంతంగా అభివృద్ధి చెందిన అంశాలను వివరించారు. ఎన్‌ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటరింగ్ అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. సాంకేతిక పురోగతులను ఉపయోగించుకుంటే దేశాన్ని బలోపేతంగా తయారు చేయవచ్చని, వికసిత భారత్ దార్శనీకతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం చైర్మన్ యుగాంతర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ, యాక్సలరేషన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ‘థర్మల్ సప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఎగ్జాస్ట్ ఇన్ కాంపాక్ట్ టన్నెల్ ఆఫ్ వార్‌షిప్’ అనే అంశంపై ప్రసంగించిన శాస్త్రవేత్త ఖగేష్ కుమార్ చౌదరిని టైటానియం పతకం, ప్రశంసాపత్రం అందించి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ హెచ్.ఎన్.దాస్, డాక్టర్ డి.ఆర్.రాజేశ్వరి, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.