
నిఘా..
● మెడికల్ మాఫియా
నామ‘మాత్ర’మే!
● ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ ● ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందుల విక్రయం ● రికార్డుల నిర్వహణకు తిలోదకాలు ● మొద్దు నిద్రలో ఔషధ నియంత్రణ శాఖ ● విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు
మహారాణిపేట: నగరంలో ఔషధ విక్రయాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. కాలం చెల్లిన మందులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేని మత్తు ఇంజెక్షన్లు, దగ్గు మందుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫార్మసిస్టులు లేకుండా, కనీస వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔషధ విక్రయాలపై సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడటం రోగులకు శాపంగా మారింది. అనేక మందుల షాపులు ప్రాథమిక నిబంధనలను కూడా పాటించకుండా నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 పైగా మెడికల్ షాపులు ఉండగా.. ఇందులో సుమారు 3,000 రిటైల్ షాపులు కాగా, 1,500 ఏజెన్సీలు, హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కనీస పారదర్శకత లేకుండానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మందుల షాపులో ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో మందుల విక్రయాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అమ్మకపు బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాలు, ఇంజెక్షన్లు విక్రయించడం, సరైన రికార్డుల నిర్వహణ లేకపోవడం, కంప్యూటర్లు వాడకపోవడం వంటివి సర్వసాధారణంగా మారాయి. నొప్పి నివారణ మందులు, మత్తు కలిగించే ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైన అక్రమాలు
ఇటీవల మందుల విక్రయాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) అధికారులతో కూడిన 40 మంది సభ్యుల నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 16 మందుల షాపులు, ఏజెన్సీలపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ సోదాల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. ఈ తనిఖీల్లో రెండు షాపుల్లో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్స్‌లో రూ.50 వేల విలువైన గడువు ముగిసిన మందులను, గాజువాకలోని శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్స్‌లో రూ.90 వేల విలువైన కాలం చెల్లిన మందులను అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన మందులను స్వాధీనం చేసుకుని షాపులను సీజ్ చేశారు.
ఈ దాడులు మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను బహిర్గతం చేశాయి. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఔషధ నియంత్రణ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మొక్కుబడి కేసులు
ఈ అక్రమాలపై సంబంధిత ఔషధ నియంత్రణ శాఖ నిఘా పూర్తిగా కొరవడిందని ఆరోపణలున్నాయి. ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్ రావు, అభిప్రియ, కూన కల్యాణి, ఎన్.కల్యాణి వంటి అధికారులు ఉన్నప్పటికీ.. తనిఖీలు, సోదాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ, వార్షిక తనిఖీల లక్ష్యాలను చేరుకోవడానికే ఈ శాఖ పరిమితమైందన్న విమర్శలున్నాయి.