
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు ● పరీక్షలకు హాజరుకానున్న 39,992 మంది విద్యార్థులు
విశాఖ విద్య: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులతో ఆర్‌ఐవో మురళీధర్ ఆదివారం సమీక్షించారు. ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందున, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలన చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని 188 జూనియర్ కాలేజీల నుంచి 32,780 మంది ఫస్టియర్ విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం జిల్లాలో 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా సెకండ్ ఇయర్ పరీక్షలకు 7,212 మంది నమోదు చేసుకోగా, వీరి కోసం 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా జిల్లాను ఏడు జోన్లగా విభజించి, పరీక్షల పర్యవేక్షణకు తనిఖీ అధికారులను నియమించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర సామగ్రిని భద్రపరిచేందుకు 14 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు.
రెండు పూటలా పరీక్షలు
సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఫస్టియర్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల సాయంత్రం 5.30గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఆర్‌ఐవో మురళీధర్ తెలిపారు.