
రిజర్వాయర్ల నిర్వహణ అస్తవ్యస్తం
● కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత దిగజారిన పరిస్థితి ● తుప్పు పడుతున్న గేట్లు, విద్యుత్ బిల్లులకూ నిధుల కటకట ● జీవీఎంసీ నుంచి నీటిపారుదల శాఖకు పేరుకుపోయిన బకాయిలు ● ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి
మహారాణిపేట: విశాఖపట్నం, అనకాపల్లి ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కీలక జలాశయాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్లపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉమ్మడి జిల్లాలోని మేహాద్రి గెడ్డ, రైవాడ, గంభీరం, తాటిపూడి వంటి నాలుగు కీలక రిజర్వాయర్లలో గేట్లు తుప్పుపట్టి పాడైపోయా యి. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌లోని ఆరు గేట్లలో రెండు పూర్తిగా పని చేయడం లేదు. ప్రభుత్వం కనీసం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కూడా నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దీనికి తోడు ఈ జలాశయాల నుంచి నీటిని వినియోగించుకుంటున్న జీవీఎంసీ.. నీటి పారుదల శాఖకు రూ.210 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిల వసూలు కోసం నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ స్వర్ణకుమార్ పలుమార్లు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. తాజాగా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా పట్టణ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని, తమ వద్ద నిధులు లేవని జీవీఎంసీ అధికారులు నీటిపారుదల శాఖకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రూ.210 కోట్ల మేర బకాయిలు
విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో రైవాడ, మేహాద్రి గెడ్డ, గంభీరం, తాటిపూడి జలాశయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా రైవాడ రిజర్వాయర్ ద్వారా తాగునీటితో పాటు ఆయకట్టు రైతులకూ నీరు అందుతోంది. 114.00 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ నుంచి జీవీఎంసీకి రోజుకు 50 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారు. ఇలా 1985 నుంచి ఏటా 1.6 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు గాను ఏటా రూ.5.42 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. జీవీఎంసీ అరకొరగా మాత్రమే చెల్లింపులు చేస్తోంది. 1997 మే నుంచి బకాయిలు పేరుకుపోయి, మొత్తం రూ.156 కోట్లకు చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. ఈ రిజర్వాయర్ పరిధిలో 12 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి జీతాలు, విద్యుత్ చార్జీలు, నిర్వహణ, జనరేటర్ ఖర్చులను కూడా నీటి పారుదల శాఖే భరిస్తోంది.
మేహాద్రి గెడ్డ రిజర్వాయర్
నగర పరిధిలోని ఈ జలాశయాన్ని పూర్తిగా జీవీఎంసీ తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. 169 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లోని ఆరు గేట్లు మరమ్మతులకు గురి కాగా.. రెండు గేట్లు పూర్తిగా పని చేయడం లేదు. ఏటా రూ.1.60 కోట్లు నీటిపారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది.
గంభీరం రిజర్వాయర్
125 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం కూడా జీవీఎంసీ తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతోంది. జీవీఎంసీ రూ.4.3632 కోట్లను నీటి పారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది.
తాటిపూడి రిజర్వాయర్
297 అడుగుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. నీటి పారుదల శాఖకు రూ.74 లక్షలు బకాయిలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వాయర్ల వారీగా బకాయిల వివరాలు(రూ.కోట్లలో)