అల్లిపురం: ఎండల్లో హాయ్.. హాయ్ అంటూ నగర ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి విధులు నిర్వహించనున్నారు. మొన్న కూలింగ్ జాకెట్లు, నేడు ఏసీ హెల్మెట్లతో నగర రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దర్శనమివ్వనున్నారు. మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కొంత ఉపశమనం కలిగే విధంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శఽంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కోసం ఏసీ హెల్మెట్లను నోయిడాలోని కరమ్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దాతల సహాయంతో కొనుగోలు చేశారు. శనివారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో రూ.6 లక్షలు విలువ గల 30 ఏసీ హెల్మెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది వీటిని తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు తగ్గుతుందన్నారు. హెల్మెట్ బరువు 740 గ్రాములు ఉంటుందన్నారు. 4 గంటల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందన్నారు. బ్యాటరీ 10 సంవత్సరాలు వారంటీ ఉందన్నారు. అలాగే ఇప్పటి వరకు 220 కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. కోరమాండల్ సిమెంట్స్, వైశ్యరాజ్ జ్యుయలర్స్, లడ్డు గోపాల్, మీరా కలెక్షన్స్ సహకారంతో మరో 40 కూల్ జాకెట్లను గుర్గావ్ నుంచి రప్పించి ట్రాఫిక్ సిబ్బందికి అందజేస్తామన్నారు.
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ల పంపిణీ
మండుటెండల నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం
సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడి
ఎండల్లో హాయ్ హాయ్