
14వ పోప్‌గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్: రోమన్ క్యాథలిక్ మిషన్‌కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్‌గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్‌కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్‌గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్‌ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిల్లో వారం రోజుల పాటు దేవునికి కృతజ్ఞత బలిపూజలు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫాదర్స్ దుగ్గంపూడి బాలశౌరీ, జాన్ ప్రకాష్, కె.జయరాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.