
కార్యకర్తలకు అండగా ఉంటా..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు
తాటిచెట్లపాలెం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు భరోసా కల్పించారు. పార్టీ బలోపేతానికి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ అందుబాటులో ఉంటానని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలెవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానన్నారు. వార్డుల్లో ప్రజా సమస్యలపై సమన్వయంతో కలిసి పోరాడాలని.. అధికారులు స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.