
అతను.. మాజీ సైనికుడు
● అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన పోలీసులు ●
● మానసిక సమస్యతోబాధపడుతున్నట్లుగా నిర్ధారణ
విశాఖ సిటీ/మధురవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్‌కు తెరపడింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫొటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధ నేపథ్యంలో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సీపీ శంఖబ్రత బాగ్చి అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి కార్‌షెడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్‌కుమార్‌గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన, చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకు ఇచ్చి పంపించారు.