
మోదకొండమ్మ జాతరకు 20 బస్సులు
మద్దిలపాలెం: పాడేరులో జరిగే శ్రీ మోదకొండమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం విశాఖ నుంచి 20 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రజా రవాణా శాఖ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, పాడేరు నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మద్దిలపాలెంలోని విశాఖ ఆర్టీసీ డిపోను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల గురుతర బాధ్యత అని స్పష్టం చేశారు. బస్సులను మంచి కండిషన్‌లో ఉంచాల్సిన బాధ్యత గ్యారేజ్ సిబ్బందిపై ఉందన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు సేవలు అందించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, నీరు, ఓఆర్‌ఎస్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిన విజయ నాయుడు, జి.బి.రావు, ఎం.ఎం.రావులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ కె.గంగాధర్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) కె.రామకృష్ణ, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.