
స్టేడియం పనులు క్లీన్‌బౌల్డ్
● రూ.40 కోట్ల మరమ్మతుల్లో డొల్లతనం ● నేమ్ బోర్డ్ వేలాడుతున్న వైనం ● ఏసీఏ మహా నిర్లక్ష్యం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) పెద్దలు ఇటీవల విశాఖ క్రికెట్ స్టేడియంలో సుమారు రూ. 40 కోట్లు వెచ్చించి చేపట్టిన మరమ్మతుల నాణ్యతలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్ సగానికి పైగా ఊడి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు పనుల్లో నాసిరకాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ప్రపంచ క్రీడా పటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం పరువును ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ మరోసారి దిగజార్చింది. ప్రస్తుత ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ చేసిన నాసిరకం మరమ్మతులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన ద్వారంపై కొత్తగా ఏర్పాటు చేసిన నేమ్‌బోర్డు ఊడిన తీరే అందుకు ప్రధాన నిదర్శనం.
అంతర్జాతీయ స్టేడియంపై నిర్లక్ష్యం
అంతర్జాతీయ ఫార్మెట్‌లో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఒకే ఏడాదిలో నిర్వహించి చరిత్ర సృష్టించి ప్రపంచ క్రీడా పటంలో తనదైన ముద్ర వేసింది డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయిన ఆరేళ్లలో కేవలం రెండే వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగలిగింది. కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా జగన్మోహన్ దాల్మియా ఉండగా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ దూరదృష్టితో వేసిన అడుగు ఒక్కసారిగా స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లకు హోమ్ గ్రౌండ్‌గా నిలబెట్టింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగా మారిపోయింది. అలాంటి స్టేడియం నేటి ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ చర్యలతో డొల్లతనం బయటపడుతోంది. గత కార్యవర్గం నిర్మించిన పైలాన్‌కు రంగులు వేసి బీసీసీఐ కార్యదర్శి జై షా, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీసీసీఐ కార్యదర్శి వస్తానని చెప్పి రాకపోవడంతో పక్కన పెట్టిన దానికి ప్రస్తుత ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ హడావుడి చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ ఆడటానికి ఢిల్లీ క్యాపిటల్స్ వసతులు బాగోలేవని చెప్పి సొమ్ము చేసుకునేందుకు తెరలేపారు. అన్ని హంగులతో ఉన్న స్టేడియానికి మరమ్మతులంటూ రూ. 40 కోట్లు వెచ్చించి గొప్పలు చెప్పుకుని చేసింది ఏమిటనేది తేటతెల్లమవుతోంది.
కేశినేని గొప్పలు
విశాఖకు ఆర్థిక రాజధాని, క్రీడా హబ్‌గా ఎదగడానికి విశాఖ స్టేడియమే కారణమని.. కార్యవర్గం అప్పట్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పేర్కొంది. 600–800 మంది సిబ్బందితో రూపురేఖలు మార్చేసామంటూ చెప్పుకొచ్చారు. జనవరి 20 నుంచి నెలరోజుల వ్యవధిలోనే అన్ని హంగులు సమకూర్చేసామన్నారు. కార్పొరేట్లు నడవక్కర్లేకుండా లిఫ్ట్‌ల్లోనే వారికి సదుపాయం కల్పించేశామన్నారు. ఆంధ్రలో అహ్మదాబాద్‌ను తలదన్నే స్టేడియం నిర్మాణం గురించి మాట్లాడుతూ ఎవరూ కట్టలేరంటూ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఊదరగొట్టారు. అమరావతి స్పోర్ట్స్ విలేజ్‌లో స్టేడియం కట్టడానికి అడిగారని, అదీ ప్రాథమిక దశలోనే ఉందంటూ, ఇంకా సైట్ అలాట్ చేయలేదని పేర్కొన్నారు. మంగళగిరి స్టేడియం స్టాండ్స్ తుప్పు పట్టేయడంతో కొన్నింటిని తొలగించాల్సి వచ్చిందని, నేడు అక్కడ రంజీ మ్యాచ్‌లకు, శిక్షణకు తప్ప పనికిరాదని సెలవిచ్చారు. ఏనాటికై నా టెస్ట్ హోదా ఉన్న వైఎస్సార్ స్టేడియమే దిక్కు అంటూనే ఇలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పనిలో పనిగా స్టేడియం ఇంత ఖ్యాతి నార్జించడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించి అభాసుపాలయ్యారు.