
క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం
శాప్ చైర్మన్ రవి నాయుడు
మహారాణిపేట: విశాఖలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, క్రీడా సంఘాల సమన్వయం ముఖ్యమన్నారు. వేసవి శిబిరాలు, క్రీడాభివృద్ధిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథ్‌లతో ఆయన సమావేశమయ్యారు. విశాఖను క్రీడా కేంద్రంగా మలిచేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 30 వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 17 వేలు క్రీడా సామాగ్రికి ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. ‘పి 4’ విధానంతో ప్రతిభావంతులైన క్రీడాకారులను దత్తత తీసుకుంటామని, ఉపాధి హామీ ద్వారా పాఠశాల మైదానాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ వేసవిలో శాప్ ద్వారా 50 వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే క్రీడాకారులను అరికట్టాలని కోరారు. క్రీడా అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. బక్కన్నపాలెంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూ. 200 కోట్లతో అత్యాధునిక స్టేడియం నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. కొమ్మాదిలో స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, అన్ని స్టేడియంలను క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో జూలియట్, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.