
వీఐపీల రక్షణలో సమయస్ఫూర్తితో మెలగాలి
అల్లిపురం: పీఎస్‌వో (గన్ మెన్) విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమని, వీఐపీలను నూటికి నూరు శాతం రక్షించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. పీఎస్‌ఓలకు శారీరక సామర్థ్యంతో పాటుగా సమయస్ఫూర్తి కలిగి వుండాలని ఆయన సూచించారు. రెండు రోజులుగా పోలీస్ బ్యారెక్స్ సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో జరుగుతున్న పీఎస్‌వోల క్యాప్సూల్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పీఎస్‌వోలను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ, నిత్యం వీఐపీల భద్రతలో ఉండే పీఎస్‌ఓలు వారి భద్రత విషయంలో అన్ని కోణాల్లో అంచనా వేస్తూ రక్షణ కల్పించాలన్నారు. రెండు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. వారికి శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్‌ఓ విధులు నిర్వహించడానికి అవసరమైన పీపీటీ రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లు, రాత్రి వేళల్లో భద్రత, రోడ్డు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, నీటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, బాంబు డిటెక్షన్, డిస్పోజింగ్, ఆహార భద్రత, ఎఫ్‌ఐబీ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రీఫింగ్), డ్రోన్ల నిఘా, ప్రథమ చికిత్స, అత్యవసర సమయాల్లో వీఐపీ భద్రత వంటి అంశాలపై శిక్షణ అందించారు.