
వయసు పైబడినా తరగని విద్యా తృష్ణ
● సంస్కృతంలో సత్తా చాటిన వైద్యుడు ● 71 ఏళ్ల వయసులో విద్యార్జనపై దృష్టి
మహారాణిపేట: రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ బి. జ్ఞానానంద (71) తన పట్టుదలతో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే చదువుపై ఆసక్తి పెంచుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సంస్కృత భారతి రెండేళ్ల కోర్సు ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన బందరు మోహనాంగరావు కుమారుడైన డాక్టర్ జ్ఞానానంద విశాఖలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి, ఎన్‌ఏడీ, గాజువాక ప్రాంతాల్లో హోమియో వైద్య నిపుణుడిగా ప్రాక్టీస్ చేశారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా, విశాఖలోని హోమియో వైద్య విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్ఞానానంద మాట్లాడుతూ, చదువుకు వయసుతో సంబంధం లేదని, ఆసక్తి ఉంటే పరీక్షల్లో విజయం సాధించడం సులభమేనని అన్నారు. ప్రస్తుతం విజయనగరం, హైదరాబాద్, కవిటిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.