
ఎంఎస్‌ఎంఈ పార్కుతో యువతకు ఉపాధి
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
పద్మనాభం: ఎంఎస్‌ఎంఈ పార్కుతో ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తామని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురంలో రూ.12.40 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో భీమునిపట్నం నియోజకవర్గం పద్మనాభం మండలం కృష్ణాపురంలో మొట్టమొదటగా ఎంఎస్‌ఎంఈ పార్కుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల పార్కు నిర్మాణానికి భూములిచ్చిన వారికి న్యాయం చేస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పరిశ్రమల పార్కుకు కేటాయించిన స్థలంలో మొదట 23 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ఇక్కడ పనులు మొదలు పెడతామని చెప్పారు. కృష్ణాపురం ఈనాం భూముల రైతులకు పట్టాదారుల పాస్ పుస్తకాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్‌ఎంఈ చైర్మన్ శివశంకర్, ఆర్డీవో సంగీత్ మాధుర్, సర్పంచ్ మొకర లక్ష్మీభవాని, ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, తహసీల్దార్ కాకర ఆనందరావు, ఎంపీడీవో ఎం.విజయ్ కుమార్, నాయకులు కె.రమణ, కె.దామోదరావు, కె.నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.