
అరుదైన నరాల వ్యాధికి విజయవంతంగా చికిత్స
ఆరిలోవ: అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు హెల్త్‌సిటీ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్న ఆమెకు మంగళవారం వైద్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం.జి.వి ఆదిత్య ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 35 ఏళ్ల రాధారాణి (ఫుడ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో అధ్యాపకురాలు) న్యూరోమైలటీస్ ఆప్టికా స్పెక్ట్రం డిసార్డర్ అనే అత్యంత అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యాధి సుమారు 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. గత ఏడాది అక్టోబరులో రాధారాణి ఆస్పత్రిని సంప్రదించగా.. వైద్య పరీక్షల అనంతరం ఆమె వెన్నుపూసలో ఎక్కువ భాగం వాపుతో పాటు కాళ్ల నరాలు పనిచేయడం లేదని గుర్తించినట్లు చెప్పారు. వెంటనే ఆమెకు ప్లాస్మా ఎక్సేంజ్ ట్రీట్‌మెంట్‌ను విజయవంతంగా అందించినట్లు వెల్లడించారు. దాదాపు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడటంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ చికిత్స విజయవంతంలో కేర్ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాము తదితరుల సహకారం ఎంతో ఉందని డాక్టర్ ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు రాధారాణి కృతజ్ఞతలు తెలిపారు.