
85 కేసుల్లో 112 మంది అరెస్ట్
● రూ.95 లక్షల సొత్తు స్వాధీనం ● రూ.48 లక్షల విలువ గల 320 సెల్‌ఫోన్లు రికవరీ
అల్లిపురం: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చిలో జరిగిన 130 ఆస్తి దొంగతనాల కేసుల్లో 85 కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 112 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.95,40,793 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. సూర్యాబాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. రికవరీ చేసిన సొత్తులో రూ.48 లక్షల విలువైన 320 సెల్‌ఫోన్లు, రూ.47,40,793 విలువైన ఇతర ఆస్తులు ఉన్నాయన్నారు. పట్టుబడిన కేసుల్లో 3 రోబరీలు, 4 పగటిపూట జరిగిన ఇంటి దొంగతనాలు, 8 రాత్రి పూట జరిగిన ఇంటి దొంగతనాలు, 4 చైన్ స్నాచింగ్‌లు, 21 మోటార్ సైకిల్ దొంగతనాలు, 1 వైర్ దొంగతనం, 44 సాధారణ దొంగతనాలు ఉన్నాయని వివరించారు. రికవరీ చేసిన వాటిలో 1.02 కేజీల బంగారం, ఒక డైమండ్ ఉంగరం, రూ.9,49,500 నగదు, 22 మోటార్ సైకిళ్లు, 4 దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు, 320 మిస్ అయిన మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 5 మేకలు, 5 లారీ బ్యాటరీలు, 500 కేజీల ఎలక్ట్రికల్ వైర్ ఉన్నాయని కమిషనర్ తెలిపారు.
నేరాల నియంత్రణకు చర్యలు
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మార్చిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 755 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 183 కార్యక్రమాలు నిర్వహించామని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు సైబర్ క్రైం పోలీసులకు చెందిన 94906 17196 నంబర్‌కు ‘హాయ్’అని మెసేజ్ చేయడం ద్వారా వాటిని త్వరగా తిరిగి పొందవచ్చని కమిషనర్ సూచించారు. డీసీపీ–1, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

85 కేసుల్లో 112 మంది అరెస్ట్