
ఇంతేనా...!
అంతాభ్రాంతియేనా...
అర్జీల గతి
● అర్జీ సమర్పించినా పరిష్కారం కాని సమస్యలు ● పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టు మెసేజ్‌లు ● కాళ్లరిగేలా తిరుగుతున్న అర్జీదారులు ● ప్రజలతో కూటమి ప్రభుత్వం ఆటలు ● పీజీఆర్‌ఎస్ అంతా డిజిటల్ మాయ అంటూ బాధితుల గగ్గోలు
పీజీఆర్‌ఎస్: ‘పరిష్కారం’ అనే భ్రమ
కలెక్టరేట్ మెట్లు : సమస్యల
‘తిరుగు ప్రయాణం’ మొదలయ్యే చోటు
అర్జీ..: ‘క్లోజ్డ్’ అని కనిపించినా,
సమస్య మాత్రం ‘ఓపెన్’లోనే..
ఆహా! ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అద్భుతాలు ఇవి.. ప్రతి సోమవారం కలెక్టరేట్ మెట్లు ఎక్కే భాగ్యం సామాన్య ప్రజలకు కల్పిస్తూ, వారి సమస్యలకు ‘శాశ్వత పరిష్కారం’ చూపే అద్భుతమైన వేదిక ఇది. వినతులు ఇచ్చి, అవి పరిష్కారం కాకుండానే ‘పరిష్కారమైపోయినట్లు’ రికార్డుల్లో చూసి, కంగుతిని మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి హ్యాట్సాఫ్!. పీజీఆర్‌ఎస్ ఓ అంతులేని ప్రహసనం.. ప్రతి సోమవారం కలెక్టరేట్ గేటు దగ్గర ఒక పండగ వాతావరణం. జన సందోహం, ఆశలు చిగురించిన మొహాలు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చామంటే సమస్య తీరినట్లే అనే భరోసా. కానీ లోపల జరిగే తతంగం మాత్రం వేరు. ఫిర్యాదు ఇచ్చామా, అది ఓపెన్ అయ్యిందా, అధికారులు చూశారా అనే కన్నా, ‘పరిష్కారమైపోయింది’ అని స్టేటస్ మారడం ముఖ్యమని అధికార యంత్రాంగం నిరూపిస్తోంది. సమస్య అలాగే ఉన్నా, కాగితాలపై మాత్రం క్లోజ్ ! ఇది కదా అసలైన ‘డిజిటల్ ఇండి యా’ అంటే!..‘గత సోమవారం ఇదే సమస్య ఇచ్చానండి, పరిష్కారం కాలేదు. మళ్లీ వచ్చాను’ అని చెప్పే నిస్సహాయుల మాటలు కలెక్టరేట్ గోడలు కూడా వింటున్నాయి. అయినా అధికారులకు మాత్రం వినిపించవు. ఎందుకంటే, వారికి కనిపించేది స్క్రీన్ మీద ‘క్లోజ్డ్’ అని. సమస్య తీరకపోయినా, అది తీరినట్లు నమోదు చేయడం అనేది ఒక వినూత్నమైన ఆవిష్కరణ. దీని వల్ల ప్రజల ఆత్మస్థైర్యం పెరుగుతుందేమో ! మళ్లీ మళ్లీ పోరాడాలనే స్ఫూర్తి వస్తుందేమో!.. సమస్య పరిష్కారం కాలేదని తెలిసి లబోదిబోమంటూ, ‘నా సమస్య ఎలా పరిష్కారం అయినట్లు?’ అని అడిగే ఫిర్యాదుదారులను చూస్తే, అధికారులు ఆశ్చర్యపోతారు. బహుశా వారికి తెలియదేమో, కాగితాలపై పరిష్కారం అయితే, నిజంగానే సమస్య తీరిపోతుందని! ఈ ‘షాక్ థెరపీ’తోనైనా ప్రజలు తమ సమస్యల గురించి ఆలోచించడం మానేస్తారేమో..!ఏదేమైనా, పీజీఆర్‌ఎస్ అనేది నిరంతరాయంగా కొనసాగే ఓ ప్రహసనం. ప్రజల ఓర్పుకు, అధికారుల ‘సామర్థ్యానికి’ అద్దం పడుతోంది. మళ్లీ వచ్చే సోమవారం కొత్త ఆశలతో, పాత సమస్యలతో ఎంతమంది కలెక్టరేట్ మెట్లెక్కుతారో చూడాలి.
–మహారాణిపేట