
కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ: జేసీ
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి
కేజీహెచ్‌లో ఏఎన్‌ఎంగా ఉద్యోగం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌ను దివ్యాంగురాలు నాగమణి వేడుకున్నారు. దివ్యాంగురాలిని కావడంతో ఉద్యోగం ఎవరూ ఇవ్వడం లేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ పొంది, ఏఎన్‌ఎం పోస్టుకు తాను అర్హురాలినని నాగమణి తెలిపారు. కేజీహెచ్‌లో పనిచేసిన తనను నిధులు లేవని తొలగించారని వివరించారు. తన భర్త అనారోగ్యంతో మంచంపై ఉన్నారని, ఇద్దరు పిల్లలతో తన జీవితం భారంగా సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం పింఛనుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని, గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేసినా స్పందన లేదని, ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు.
మహారాణిపేట: జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోందని, అర్హులైన ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, తప్పుగా నమోదైన ఆధార్ నంబర్ సవరణ, చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, కార్డులు సరెండర్ చేయడం వంటి ఆరు రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనాథాశ్రమాల్లో ఉండే వృద్ధులు కూడా రేషన్ కార్డులు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చని జేసీ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ నెలలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారుల చిరునామాకు పంపడం జరుగుతుందని ఆయన వివరించారు.