
● మాస్టర్‌ప్లాన్ రహదారుల అభివృద్ధికి టెండర్లు ● రూ.154
విశాఖ సిటీ: విశాఖ నగరంలో కొత్త రహదారుల అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.154.60 కోట్ల అంచనా వ్యయంతో ఏడు ప్రాంతాల్లో 26.77 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఏడాదిలో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రణాళికలు
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే ఆ రహదారిలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌లో కొత్త రహదారుల అభివృద్ధికి చోటు కల్పించారు. అలాగే, ప్రస్తుతమున్న రోడ్ల విస్తరణ చేపట్టేందుకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా 15 రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటిలో 8 రోడ్ల విస్తరణతో పాటు ఏడు రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ 15 రహదారుల నిర్మాణాల్లో కొన్నింటిని జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ చేపట్టనున్నాయి. వీఎంఆర్‌డీఏ ఏడు రోడ్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను చేపట్టింది.
ప్రాంతం కి.మీ. వ్యయం(రూ.కోట్లలో)
దివీస్ రోడ్ (చిప్పాడ) 6.45 36,93
నేరెళ్లవలస 3.90 19,74
బోయపాలెం రోడ్ 3.10 8,92
గంభీరం రోడ్–1 1.46 5,69
గంభీరం రోడ్–2 2.18 14,73
శివశక్తినగర్ రోడ్ 1.67 7,77
అడవివరం శొంఠ్యాం రోడ్ 8.03 60,82
మొత్తం 26.77 రూ.154.60 కోట్లు
ఏడాదిలో పూర్తికి కసరత్తు
ఈ మాస్టర్‌ప్లాన్ రహదారుల్లో భాగంగా చిప్పాడ–పోలిపల్లి (దివీస్ రోడ్డు), నేరెళ్లవలస–తాళ్లవలస, బోయపాలెం–మంగమారిపేట, పరదేశిపాలెం–గంభీరం, గంభీరం–గంభీరం హైవే, శివశక్తినగర్–హరిత ప్రాజెక్ట్స్, అడవివరం జంక్షన్–గండిగుండం రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి వీటిని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సునాయాసంగా రాకపోకలు సాగించడానికి అనువుగా ప్రత్యామ్నాయ రోడ్లను తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ కూడా ఇతర రహదారుల నిర్మాణాలకు సమాయత్తమవుతున్నాయి.